Asianet News TeluguAsianet News Telugu

మాదాపూర్ కారు ప్రమాదం: కొడుకుని దాచి.. మరొకరిని పోలీసులకు అప్పగింత, సినీఫక్కిలో తండ్రి స్కెచ్

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో కొత్త కోణం బయటపడింది. సుజిత్ రెడ్డి, ఆశిష్ ఇద్దరూ మద్యం మత్తులో ప్రమాదం చేశారని నిర్ధారించారు పోలీసులు. సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డి వేరే వ్యక్తి కారును నడిపారంటూ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు

twist in madhapur road accident
Author
Hyderabad, First Published Jun 29, 2021, 6:55 PM IST

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో కొత్త కోణం బయటపడింది. సుజిత్ రెడ్డి, ఆశిష్ ఇద్దరూ మద్యం మత్తులో ప్రమాదం చేశారని నిర్ధారించారు పోలీసులు. సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డి వేరే వ్యక్తి కారును నడిపారంటూ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. కొడుకు సుజిత్‌ని నల్లకుంటలోని డీడీ కాలనీలో రహస్య ప్రాంతంలో దాచిపెట్టి పోలీసులను బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు రఘునందన్ రెడ్డి.

అతని తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు టెక్నికల్ ఆధారంగా కారులో వున్నది సుజిత్, ఆశిష్ అని తేల్చారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన సుజిత్ తండ్రి రఘునందన్‌ రెడ్డిని నిందితుల లిస్ట్‌లో చేర్చారు. అతనిపై 202, 203, 205, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుజిత్ రెడ్డి, ఆశిష్‌లపై 304/2, 201, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మొత్తం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. 

కాగా, మాదాపూర్‌లోని మైహోం అబ్రా అపార్ట్‌మెంట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆడి కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందుకు ఎగిరి... గింగిరాలు తిరుగుతూ దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. సీసీ కెమెరాలను పరిశీలించి కారు నడిపిన వ్యక్తి ఉప్పల్‌లోని విజయ్‌పురి కాలనీలో ఉండే వాకిటి రఘునందన్ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డి(24)గా పోలీసులు గుర్తించారు. ఇతను గోవాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

శనివారం రాత్రి స్నేహితుడు పి.ఆశిష్‌తో కలిసి కారులో రాయదుర్గంలో వచ్చాడు. అక్కడే తెల్లవారుజాము వరకు మద్యం తాగి ఉదయం ఇంటికి బయలు దేరారు. సుజిత్ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. అత్యంత వేగంతో నిర్లక్ష్యంగా ఆటోను ఢీకొట్టాడు. ఆధారాలు ఉండకూడదనే ఉద్దేశంతో కారు నంబర్ ప్లేట్లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కారు ఢీకొట్టిన వేగానికి ఆటోలో నుంచి ఫుట్‌పాత్‌పై ఎగిరిపడి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు బేగంపేట్‌కు చెందిన వ్యక్తిగా  పోలీసులు గుర్తించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios