హైదరాబాద్: నిధుల కుభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు షాక్ ఇచ్చార నాంపల్లి కోర్టు జడ్జి. రవిప్రకాష్ కు రిమాండ్ విధించారు. ఈనెల 18 వరకు ఆయనకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. 

14 రోజులపాటు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రవిప్రకాష్, టీవీ9 మాజీ సీఎఫ్ వో ఎంవీఎన్ మూర్తిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. నిధుల దుర్వినియోగం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను శనివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

టీవీ9లో రూ.18 కోట్ల మేర మాజీ సీఈవో రవిప్రకాష్ బృందం అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత సిఈవో గొట్టిపాటి సింగారావు బంజారాహిల్స్ పీఎస్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రవిప్రకాష్, ఎంవీఎన్ మూర్తిలపై సెక్షన్ 420, 409,418, 509 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. 

శనివారం ఉదయం బంజారాహిల్స్ డీసీపీ సుమతి నేతృత్వంలో రవిప్రకాష్, ఎంవీఎన్ మూర్తిలను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలింది. దాంతో మరింత సమాచారం కోసం రిమాండ్ కోసం పోలీసులు ప్రయత్నించారు. 

అందులో భాగంగా రవిప్రకాష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలో ఉన్న నాంపల్లి కోర్టు జడ్జి ఎదు హాజరుపరిచారు. అయితే రవిప్రకాష్ కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. దాంతో అతనని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.