తనను కావాలని టార్గెట్ చేసి... తనపై కుట్ర చేస్తున్నారని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపించారు. తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  ఏప్రిల్ 18వ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయని... తర్వాత జరిగి పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రశ్నిస్తూ తాను కథనాన్ని ప్రసారం చేశానని రవి ప్రకాష్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాను చేసిన కథనాలు వారికి నచ్చలేదని... అందుకే అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆయన అన్నారు. తనను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపారపరమైన అజెండా ఉందని ఆరోపించారు. 

తాను ఆ లైవ్ షో ప్రసారం చేసిన సమయంలో కూడా ప్రభుత్వాన్ని గురించి ప్రస్తావించలేదని, వ్యవస్థ వైఫల్యం పైనే ప్రశ్నించానని ఆయన చెప్పారు. దాదాపు 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, తామంతా చూసీచూడనట్టు గుడ్డిగా వ్యవహరించాలా అని రవిప్రకాష్ ప్రశ్నించారు.