దేశవ్యాప్తంగా ఈవీఎంల టాంపరింగ్, వాటి పనితీరుపై చర్చనడుస్తున్న సమయంలో జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు రాజకీయంగా కలకలం రేపింది. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం నుంచి మిని స్టేడియంలో ఉన్న గోడౌన్‌కు సోమవారం రాత్రి ఆటోలో 10 ఈవీఎంలను తరలించారు. అయితే ఈ ఈవీఎంల తరలింపుపై సమాచారం అందుకున్న స్థానిక జర్నలిస్టులు ఫోటోలు, వీడియోలు తీసి వార్తలు ప్రసారం చేశారు. దీంతో ఎన్నికల సంఘం దిగివచ్చి ఈ ఈవీఎంల తరలింపుపై సమాదానం చెప్పాల్సి వచ్చింది. 

అధికారులు ఇలా ఈవీఎంలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల సిబ్బందికి అవగాహన కోసం ఉంచిన ఈవీఎంలనే గోడౌన్‌కు తరలిస్తుండగా కొందరు జర్నలిస్టులు అక్కడికి చేరుకుని అసత్యాలను ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అసత్యప్రచారానికి కారణమైన జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్థానిక పోలీసులకు సూచించారు. 

అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) తీవ్రంగా ఖండింంచింది. తమకు ప్రతి విషయంలో అడ్డొస్తున్నారనే కోపంతోనే జర్నలిస్టులపై స్థానిక అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను, భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలకు దిగినట్లు టీయుడబ్ల్యుజె నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విలేకరులపై   446, 186, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం దారుణమని...బేషరత్తుగా ఆ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని టీయుడబ్ల్యుజె నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు జగిత్యాల కలెక్టర్, ఎస్పీ లకు వినతి పత్రాలను అందించడంతో పాటు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు.