పోలింగ్ జరుగుతున్న సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడారని పేర్కొంటూ టిటిడిపి అధ్యక్షులు ఎల్.రమణ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలున్నట్లు రమణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి, అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేసినట్లేనంటూ జగదీశ్‌రెడ్డి ఆరోపించడాన్ని రమణ తప్పుబట్టారు. ఇలా ఎన్నికల నియమావళిని ఉళ్లంగిస్తూ మాట్లాడిన మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రమణ కోరారు.  

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్నిచోట్ల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 11 తారీఖున జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.