ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతు పలుకుతున్నట్లు తెలిపారు టీఎన్జీవో నేత రవీందర్ రెడ్డి. సోమవారం టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులతో కలిసి తాము కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు.

కార్మికులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని... చర్చలు జరిపితే మిగతా ఉద్యోగ వర్గాలకు పరిష్కారం దొరుకుతుందని రవీందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించుకుందామని.. కార్మికుల పక్షాన ఉద్యోగ సంఘాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అశ్వత్థామరెడ్డి మీడియాతో ట్లాడుతూ..ఆర్టీసీలో సరైన వైద్య సదుపాయం లేదని, పనిగంటలు పెరిగాయని, ఉద్యోగుల భర్తీ జరపడం లేదని ఆయన మండిపడ్డారు. కార్మికులు ఎంతో కష్టపడ్డప్పటికీ తమకు ఎలాంటి ఫలితాలు అందడం లేదని తెలిపారు.

సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులను తెలంగాణ సమాజానికి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ నిధులను ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయి పడిందన్నారు.

తాను గతంలో టీఎన్జీవో నేతలపై చేసిన విమర్శలకు చింతిస్తున్నానని అశ్వత్థామరెడ్డి తెలిపారు. భేషజాలు అవసరం లేదని.. తామే టీఎన్జీవో దగ్గరకు వచ్చామని, ఆర్టీసీ సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరామన్నారు. 

తమ డిమాండ్ల సాధనకు  ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ నేతలు తమ సమ్మెకు అన్ని సంఘాల మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే జేఎసీ నేతలు మంగళవారం నాడు సాయంత్రం టీఎన్‌జీవో నేతలతో భేటీ అయ్యారు. సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.

సమ్మెకు వెళ్లే ముందుకు ఆర్టీసీ కార్మికులు కనీసం తమతో మాట మాత్రంగా కూడ చర్చించలేదని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ప్రకటించారు.

టీఎన్‌జీఓ కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల జేఎసీ మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి  టీఎన్‌జీవో నేతలు  ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో  టీఎన్‌జీవో నేతలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో  టీఎన్‌జీవోలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మె పేరుతో 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

ఈ సమ్మెకు టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయపార్టీలు కూడ మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ జేఎసీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది .ఈ బంద్ కు పలు రాజకీయపార్టీలు మద్దతుగా నిలిచాయి.ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కూడ మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.

 రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వథామ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు  తెలంగాణ ఎన్జీవో నేతలతో భేటీ అయ్యారు. తమ సమ్మెకు మద్దతుగా నిలవాలని టీఎన్‌జీవో  అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో పాటు కార్యవర్గసభ్యులను కోరారు. ఈ సమ్మెకు తెలంగాణ ఎన్‌జీవో నేతలు కూడ సానుకూలంగా స్పందించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లకు తాము మద్దతును ప్రకటిస్తామని తెలంగాణ ఎన్‌జీవో నేతలు ఆర్టీసీ జేఎసీ నేతలకు సమాధానమిచ్చారు.ఈ విషయమై జేఎసీ నేతలు అధికారికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించనున్నారు.

ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు టిఎన్‌జీవో నేతలు మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడ లేకపోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుతో పాటు మరో నాలుగు తీర్మానాలను కూడ టీఎన్‌జీవో చేసింది.