Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠం

టీఎస్ ఆర్టీసి సమ్మెపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి సిఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఆయన లేఖలో గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి లేఖ పూర్తి పాఠం...

TSRTC strike: Revanth Reddy open letter to KCR
Author
Hyderabad, First Published Oct 6, 2019, 2:10 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఆస్ఆర్టీసి) కార్మికుల సమ్మెపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం కింద ఇస్తున్నాం

బహిరంగ లేఖ.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారికి,
విషయం : ఆర్టీసీ కార్మికుల సమ్మె, పరిణామాలు, వారి సమస్యల గురించి...

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అద్వితీయమైనది. రెగ్యూలర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేల మంది ఆర్టీసీ కార్మికులు నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ వంతు పాత్రపోషించారు. తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి, ఎంతో సాహసోపేతంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. టీఆర్ఎస్ అధినేత హోదాలో నాడు మీరు కూడా పలు వేదికల పై వారి పోరాట పటిమను శ్లాఘించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల జీవితాలు అద్భుతం చేస్తామని హామీలు ఇచ్చారు. 

గడచిన ఐదున్నరేళ్ల మీ పాలనలో ఆర్టీసీ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండకూడదని, వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యమ సమయంలో మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక ఊసరవెల్లిలా రంగులు మార్చారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంగతి దేవుడు ఎరుగు... ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే మనసు మీకు లేకుండాపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి... ప్రైవేటీకరణతో సంస్థ మనుగడే లేకుండా చేయాలన్న కుట్రకు తెరతీశారు.

ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 15 డిమాండ్లతో సమ్మెకు దిగారు. గడచిన ఐదున్నరేళ్లుగా మీ పాలనలో న్యాయం జరుగుతుందేమోనని వారు ఎదురు చూశారు. మీ నియంతృత్వ, మొండి వైఖరితో సమ్మె తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయింది. వారి డిమాండ్లన్నీ న్యాయ సమ్మతమైనవే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కార్మికుల సమస్యల పై సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఐదున్నరేళ్లలో ఒక్కసారైనా వారిని ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారా? వారి కష్టాలు, బాధలు వినే ప్రయత్నం చేశారా? పైగా చిరు ఉద్యోగుల పై మీ నియంతృత్వ వైఖరి ప్రదర్శించడం దారుణం. డెడ్ లైన్ లోపు విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు పీకేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు వినకపోతే ఉద్యోగాలు పీకేయడానికి ప్రభుత్వం అంటే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు. కార్మికులేమీ మీ బానిసలు కాదు. బాధ్యతగల పదవిలో ఉండి, చిరు ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం సీఎం స్థాయికి తగని హేయమైన చర్య. మీ హెచ్చరికలను బేఖాతరు చేసి కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాట పటిమను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్లలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇంకా మిగిలే ఉందనడానికి ఇది నిదర్శనం. బతుకమ్మ, దసర సందర్భంగా సమ్మె జరిగితే ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలి. సమ్మె నివారణకు చొరవ తీసుకోవాల్సిన మీరు నేను చెప్పిందే వేదం, లేదంటే వేటే అంటూ మంకుపట్టు ప్రదర్శించడం పరిపక్వతలేని మీ మానసిక స్థితికి అద్దంపడుతోంది. సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్యను జఠిలంగా మార్చింది మీరే.

సంస్థ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీల భర్తీ తక్షణం చేపట్టాలని, కండక్టర్లు-డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీ కార్మికుల ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని, మహిళా కండక్టర్ల విధులు రాత్రి 8 గంటల లోపు ముగిసేలా చూడాలని, జీతాలు ప్రతినెలా మొదటి తారీఖునే ఇవ్వాలని... కార్మికులు చేస్తోన్న డిమాండ్లలో న్యాయం ఉంది.

తక్షణం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై సానుకూలంగా స్పందించి, సమ్మె విరమణకు చొరవ తీసుకోండి. ఆర్టీసీ కార్మికులతో పెట్టకోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే అని ఒకనాడు మీరు చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం ఆ ప్రకటన మీకు కూడా వర్తిస్తుందన్న విషయం మర్చిపోవద్దు.


ఎ. రేవంత్ రెడ్డి, లోక్ సభ సభ్యుడు – మల్కాజ్ గిరి.

ఇదిలావుంటే, టీఎస్ ఆర్టీసి జెఎసి కన్వీనర్ కె. హనుమంతరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం రేవంత్ రెడ్డిని కలిసింది. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని తాము రేవంత్ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios