Asianet News TeluguAsianet News Telugu

TSRTC Mangoes Home Delivery: సజ్జనార్ సరికొత్త నిర్ణయం.. మామిడి పళ్ల డెలివరీ.. రైతులకు, ఆర్టీసికి కలిసొచ్చేలా!

టీఎస్‌ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి, రైతులకు కలిసొచ్చేలా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బంగినపల్లి మామిడిపళ్లను తోట నుంచి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేసే సేవలను ముందుకు తెచ్చారు. కనీసం ఐదు కిలోల మామిడి పళ్లను ఆర్డర్ చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

tsrtc offers door delivery of mangoes announces MD vc sajjanar
Author
Hyderabad, First Published May 4, 2022, 2:58 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ (TSRTC)ను సరికొత్త దారుల్లో పరుగులు పెట్టించే నిర్ణయాలు ఎండీ సజ్జనార్(VC Sajjanar) తీసుకుంటున్నారు. నష్టాలతో కూరుకుపోతున్న సంస్థను లాభాల బాట పట్టించడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అటు ప్రజలకు చేరువ చేయడంతోపాటు లాభాల వైపు పరుగులు తీసేలా సజ్జనార్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఆయన ఆర్టీసికి మరో సరికొత్త సేవను జోడించారు. మధురమైన మామిడి పళ్లను తోట నుంచి నేరుగా ఇంటికే డెలివరీ చేసే సర్వీస్‌ను టీఎస్ఆర్టీసీ అందిస్తున్నట్టు వెల్లడించారు.

వేసవి కాలం వచ్చిందంటే.. ఫల రారాజు మామిడి పళ్లు కూడా గుర్తుకు వస్తాయి. కానీ, మండే ఎండలతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆపసోపాలు పడే పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో మామిడి పళ్లపై ఇష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవడం దుర్భరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆర్టీసికి, మరో వైపు రైతులకూ కలిసి రావడమే కాదు, మామిడి పళ్ల ప్రియురాలకూ స్వీట్ న్యూస్‌ను ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందుకే ఆయన తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. మధురమైన మామిడిపళ్లు తోట నుంచి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేస సేవను ప్రారంభించనున్నట్టు చెప్పారు. చెమటోడ్చి ప్రజల ఆకలి తీర్చే రైతన్నను ఆదుకోవాలనీ సూచనలు చేశారు. అందుకు ఒక మార్గం ఉందని, టీఆఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్‌తో మామిడి పళ్లను ఇంటి వద్దకే డెలివరీ చేసే సౌకర్యాన్ని పొందండని పేర్కొన్నారు. తద్వార రైతులను ఆదుకోండని తెలిపారు. మామిడి పళ్లతో ఈ వేడిమిని ఎదుర్కోండని తెలిపారు.

బంగినపల్లి మామిడిపళ్లను టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ అందిస్తున్నదని వివరించారు. ఈ స్వచ్ఛమైన మామిడి పళ్లను ఇంటి వద్దకే తెచ్చుకోండని ఆయన ట్వీట్ చేసిన పోస్టర్ పేర్కొంది. ఒక కిలోకు రూ. 115గా ప్రకటించింది. కాగా, ఈ సేవలను పొందడానికి కనీసం ఐదు కిలోల మామిడి పళ్లను ఆర్డర్ చేయాలనిత తెలిపింది. వారం రోజుల్లో డెలివరీ అవుతుందని వివరించింది. బుకింగ్ కొరకు www.tsrtcparcel.com వెబ్‌సైబ్‌ను సందర్శించాల్సిందిగా ఆ ప్రకటన కోరింది. అంతేకాదు, ఈ ప్లాన్ గురించి తెలుసుకోవాంటే.. 040-23450033 లేదా 040-69440000లను సంప్రదించాల్సిందిగా ఆ ప్రకటనలో ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios