Asianet News TeluguAsianet News Telugu

మెట్రోపై సజ్జనార్ వార్..? వామ్మో మాములుగా లేదుగా.. ఈ వీడియో చూడండి..

ఇటీవల చంటి బిడ్డను చేతిలో పట్టుకుని మెట్రో రైలు ఎక్కిన ఓ మహిళ.. సీట్లు ఖాళీగా లేకపోవడంతో కింద కూర్చొని(Woman with infant sits on floor in metro) ప్రయాణించింది. చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఆమెకు తమ సీటు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 

TSRTC MD VC Sajjanar Posts Special Video on Moral values goes viral
Author
Hyderabad, First Published Oct 28, 2021, 11:16 AM IST

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. సంస్థను అభివృద్దిలోకి తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఆర్టీసీ బస్సులపై జనాల్లో నమ్మకాన్ని కలిగించేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జనాలను ఆకట్టుకునేలా పోస్ట్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రెండింగ్ టాపిక్స్‌తో ప్రయాణికుల్లో ఆర్టీసీపై సానుకూల భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ స్కూల్‌లోని పిల్లలతో రూపొందించిన అద్భుతమైన వీడియోను Sajjanar తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇటీవల చంటి బిడ్డను చేతిలో పట్టుకుని మెట్రో రైలు ఎక్కిన ఓ మహిళ.. సీట్లు ఖాళీగా లేకపోవడంతో కింద కూర్చొని(Woman with infant sits on floor in metro) ప్రయాణించింది. చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఆమెకు తమ సీటు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనుషుల్లో మానవత్వం తగ్గిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

అయితే ఈ ఘటనపైనే సజ్జనార్ పరోక్షంగా స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఎప్పుడూ నైతిక విలువలకు చోటు ఉంటుందని ఆయన అన్నారు. నైతిక విలువలను పెంచుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిద్దాం అని పిలుపునిచ్చారు. మెట్రోపై సజ్జనార్ తన ట్వీట్‌తో వార్ ప్రకటించారా..? అనే చర్చ కూడా మొదలైంది. 

 

ఆ వీడియోలో పిల్లలు.. ఆర్టీసీ బస్సును పోలిన విధంగా కూర్చొని ఉంటారు. ఓ పిల్లోడు బస్సు డ్రైవ్ చేస్తున్నట్టుగా.. మిగిలిన వారు సీట్లలో కూర్చొని ఉంటారు. అక్కడ సీట్లు అన్ని నిండిపోయి ఉంటాయి.  తర్వాత వృద్దురాలిగా, చేతిలో చంటి పిల్లాడితో, గర్బవతిగా, దివ్యాంగురాలిగా.. ఒక్కొక్కరు అక్కడికి వస్తారు. దీంతో అక్కడ కూర్చొన్న వారిలో కొందరు లేచి వారికి సీట్లు ఇస్తారు. స్కూల్ పిల్లలు చేసిన ఈ వీడియో ద్వారా మహిళలకు, వృద్దులకు గౌరవం ఇవ్వాలనే అద్బుతమైన సందేశాన్ని ఇచ్చారు.

ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. ‘అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన  టీఎస్ ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. నైతిక విలువలను పెంచుకుందాం’అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని పాటించాలని కోరుతున్నారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారని అభినందనలు తెలుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios