హైదరాబాద్: వేళ్లు తీసేసినా, తల నరికేసినా ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీని పరిరక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని ప్రజల ఆస్తుల కోసమే ఉద్యమం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు తెలంగాణ బంద్ కు సహకరించిన రాజకీయ పార్టీలకు, ఉద్యోగ సంఘాలకు అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ బంద్ విజయవంతం అయ్యిందని స్పష్టం చేశారు. బంద్ లో అక్కడక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ కార్మికులపై పోలీసులు దాడులు చేయడాన్ని ఖండించారు. తెలంగాణ బంద్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటించింది. ఈనెల 20 అంటే ఆదివారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని జేసీ నిర్ణయించింది. 

అలాగే ఆర్టీసీ డిపోల దగ్గర ప్రధాన కూడలిలో ప్లకార్డులు ధరించి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకుందాం, ప్రజలు సహకరించండి అనే ప్లకార్డులతో నిరసన తెలపాలని సూచించారు. గ్రామగ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి, ఓ ప్రభుత్వమా హై కోర్టు ఆర్డర్ ను కూడా పట్టించుకోరా అనేటువంటి నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన చేపట్టాలని పిలుపునిచ్చారు.  

ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ నేత పోటు రంగారావుకు గాయం అవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరిగిన నిరసన  కార్యక్రమంలో పాల్గొన్న పోటు రంగారావు చేతికి తీవ్ర గాయమైంది. వ్యాన్ లోకి రంగారావును ఎక్కిస్తుండగా రెండు తలుపుల మధ్య చేయిపడటంతో బొటన వేలు తెగిపోయిందని ఇది చాలా బాధాకరమన్నారు. 

ఆర్టీసీ సమ్మె కేవలం కార్మికులది మాత్రమే కాదని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకే చేస్తున్న పోరాటమని చెప్పుకొచ్చారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తప్పుమీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం చర్చలకు పిలిచినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజారవాణా వ్యవస్థను  కాపాడుకునేందుకే సమ్మెకు దిగినట్లు తెలిపారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం చర్చలకు రావాలని కోరారు. 

తెలంగాణ బంద్ విజయవంతం కేసీఆర్ కు పెద్ద గుణపాఠమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతలా బంద్ జరగలేదని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ నష్టాలు, సమ్మె వల్ల జరిగన నష్టాలపై ప్రభుత్వం తప్పుడు వార్తలు రాయిస్తుందని ఇది సరికాదన్నారు. 

హైకోర్టులో సైతం తప్పుడు అఫిడవిట్ తో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తప్పుబట్టే ప్రయత్నం చేస్తుందని దానికి సమాధానం చెప్పేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు.