హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు కార్యచరణ ప్రకటించారు. ఈనెల 13 నుంచి 19 వరకు ఉద్యమ కార్యచరణ ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. ఈనెల 19న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. 

ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే ఈనెల 14 అన్ని బస్ డిపోల ముందు బైఠాయించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఈనెల 15న రాస్తారోకోలు-మానవహారాలు, 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, 17న తెలంగాణ వ్యాప్తంగా ధూంధాం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 

ఇకపోతే ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటాయని స్పష్టం చేసింది. ఇకపోతే ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చింది. 

టీఎస్ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు, నిరసన కార్యక్రమాలకు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు సహకరించాలని జేఏసీ నేతలు కోరారు. తాము ఆర్టీసీని బతికించుకునేందుకు మాత్రమే సమ్మె చేస్తున్నామని ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదు అని నేతలు స్పష్టం చేశారు. 

సమ్మె ఎఫెక్ట్: దసరా సెలవులు పొడిగింపు

ఇకపోతే టీఎస్ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రవాణా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రాష్ట్రంలో దసరా సెలవులను పొడిగించింది. ఈనెల 19 వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.