మరో శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme)కు విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుందనీ, వారికి అనుగుణంగా బస్సులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ, త్వరలోనే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
TSRTC: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రేవంత్ సర్కార్.. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి దాదాపు 200 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు, అందులో 50 బస్సులను ఈ నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకరానున్నట్టు, ఈ మేరకు ఏర్పాటు జరుగుతుయని వెల్లడించారు.
అలాగే.. మరో ఆరు నెలల్లో దాదాపు 2వేల బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని సజ్జనార్ తెలిపారు. 512 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్‌లు,92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులను అందుబాటులోకి తీసుకవస్తామని తెలిపారు.హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, వచ్చే ఏడాది మార్చి నాటికి తీసుకవస్తామని, ఈ మేరకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇదిలా ఉంటే.. 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme) పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి విశేష స్పందన వస్తోంది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. ఈ పథకం వల్ల తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చాడు. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా?' అని ప్రశ్నించాడు. బస్సుల్లో మొత్తం ఉచితంగా ప్రయాణించే మహిళలే ఉన్నారని, డబ్బులు చెల్లించి మరీ తాము నిల్చోవాల్సి వస్తోందని ఆవేదన వెల్లబుచ్చారు. తమనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.