హైదరాబాద్: ఈ నెల 5వ తేదీ లోపుగా విధుల్లో చేరాలని తెలంగాణ సీఎం ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్ పెట్టడంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఆర్ధిక పరిస్థితులతో పాటు తమ ఉద్యోగాల విషయమై ఆందోళనతో ఆర్టీసీ కార్మికులు విదుల్లో చేరుతున్నారు.  

రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరేందుకు ఆయా డిపోలకు చెందిన అధికారులకు తమ సమ్మతిని తెలుపుతూ లేఖలను ఆదివారం నాడు అందించారు.రాష్ట్ర వ్యాప్తంగా 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.అంతేకాదు ఈ నెల 5వ తేదీలోపుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు విదుల్లో చేరాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 

సీఎం కేసీఆర్ చివరి అవకాశమని హెచ్చరించడంతో ఆదివారం నాడు పలు డిపోల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి ఆర్టీసీ బస్ డిపో కు చెందిన ఆర్టీసీ డ్రైవర్  సయ్యద్ హైమత్ ఆదివారం నాడు విధుల్లో చేరారు.ఈ మేరకు డిపో మేనేజర్ కు సయ్యద్ హైమత్ (స్టాఫ్ నెంబర్ 318188) డీఎంకు లేఖను అందించారు. కామారెడ్డి డీఎం గణపతిరాజుకు లేఖను ఇచ్చారు.

సిద్దిపేట ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ పి. బాల విశ్వేశ్వరరావు విధుల్లో చేరతానని ఆర్టీసీ డీఎంకు లేఖ ఇచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బాల విశ్వేశ్వరావు ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆర్టీసీ డిపోలో విధుల్లో చేరేందుకు శేషాద్రి అనే డ్రైవర్ డీఎంకు రిపోర్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకొన్న టీఎంయూ నేతలు శేషాద్రిపై కారం చల్లి అతడిని వెనక్కి తీసుకెళ్లినట్టుగా ఆర్టీసీ డీఎం ఉన్నతాధికారులకు సమాచారం పంపారు.

ఈ ఘటన చోటు చేసుకొన్న విషయం తెలిసిన వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ స్పందించారు. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముందుకు వస్తే తాము పూర్తి భద్రతను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరైనా వ్యక్తులు ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తే వారిని బెదిరిస్తే చట్ట ప్రకారంగా వారిపై కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.

మరోవైపు కోరుట్ల ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. బాధితుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి విదుల్లో చేరవద్దని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి కార్మికులను కోరారు. సమ్మె యధావిధిగా కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రకటించారు.ఆదివారం నాడు ఆర్టీసీ జేఎసీ నేతలు అత్యవసరంగా సమావేశమై ఈ మేరకు సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.