హైదరాబాద్: ఎట్టిపరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. సమ్మె ఎట్టి పరిస్థితుల్లో విరమించమని ఇది తమ ఆఖరి అస్త్రమని చెప్పుకొచ్చారు. 

తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని కానీ ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. హైకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ ఎలాంటి ఖచ్చితమైన ప్రకటన గానీ హామీ గానీ ఇవ్వకపోవడంతోనే తాము సమ్మెబాట పట్టినట్లు తెలిపారు. సమ్మె ద్వారా అయిన తమ డిమాండ్లు పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. 

హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే తాము వెళ్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయం గత కొద్దిరోజులుగా చెప్తూనే ఉన్నామన్నారు. 

అయితే చర్చలకు సమ్మె విరమించి వెళ్లాలంటే మాత్రం కుదరదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేవరకు తాము సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు అశ్వత్థామరెడ్డి. మరి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా అన్నది వేచి చూడాలి. 

ఇకపోతే 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటపట్టిన సంగతి తెలిసిందే. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగలు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నట్లేనన్న ప్రభుత్వం వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.