TSRTC: ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఆర్టిసి బస్సు దగ్దం... మావోయిస్టుల పనేనా?

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రంలో ఆర్టిసి బస్సుకు దగ్దమయ్యింది. బస్సుకు నిప్పుపెట్టింది ఆకతాయిలా లేక మావోయిస్టులా అన్నది తేలాల్సి వుంది. 

TSRTC Bus Fired by unknown Persons in mulugu district

ములుగు: తెలంగాణ ఆర్టిసి (TSRTC)కి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ములుగు జిల్లా (mulugu district)లో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో నిలిపివుంచిన బస్సుకు దుండగులు నిప్పంటించి పరారయ్యారు. అయితే స్థానికులు మంటలను గమనించి ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.  

వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రం నుండి ప్రతిరోజు తెల్లవారుజామునే ఆర్టిసి బస్సు బయలుదేరుతుంది. ఇందుకోసం రాత్రికే బస్సు అక్కడికి చేరుకుంటుంది. డ్రైవర్, కండక్టర్ రాత్రి వెంకటాపురంలోనే బసచేసి తెల్లవారుజామునే డ్యూటీ ఎక్కుతారు. 

ఇలా ప్రతిరోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి కూడా వెంకటాపురంలో ఆర్టిసి బస్సు ఆగింది. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఈ బస్సుకు నిప్పంటించి పరారయ్యారు. బస్సు మంటల్లో కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.   

read more  బస్సు గుద్దేస్తుందనే భయంతో బ్రిడ్జిమీదినుంచి దూకిన చిన్నారి.. కాళ్లు విరిగి...

మంటల్లో కాలిపోయి బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కాలిపోయిన బస్సును పరిశీలించారు. బస్సుకు నిప్పుపెట్టిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. ఇది ఆకతాయిల పనా...? లేక మావోయిస్టుల (maoists) దుశ్చర్యా..? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఆర్టిసి బస్సు దహనం మావోయిస్టుల పనేమో అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల వెంకటాపురం మండలంలోని గ్రామాల్లో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు బయటపడ్డాయి. పోలీసులకు మావోయిస్ట్ కదలికలపై సమాచారం చేరవేస్తున్నారంటూ ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తున్న వారి పేర్లను బయటపెట్టిన మావోయిస్టులు గట్టిగా హెచ్చరించారు. 

ఇదే వెంకటాపురం మండలం పేరూరు సమీపంలో కొద్దిరోజుల క్రితమే భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. 

ఇలా మావోయిస్టుల కదలికలు ఎక్కువగా వుండే వెంకటాపూర్ లో బస్సు దగ్దం వారి పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు దగ్దంపై మావోయిస్టుల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios