హైదరాబాదీలకు శుభవార్త.. ఇకపై సాధారణ ప్రయాణీకులకూ రూట్‌పాస్, రేట్లు ఎంత, పొందడమెలా..?
ఇకపై సాధారణ ప్రయాణీకులకు కూడా రూట్ పాస్‌లు ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాస్ సాయంతో నిర్ణీత రూట్‌లో 8 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చని ఆర్జీసీ వెల్లడించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సుల ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇకపై సాధారణ ప్రయాణీకులకు కూడా రూట్ పాస్‌లు ఇస్తున్నట్లు పేర్కొంది. తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ పాస్ వల్ల లబ్ధి చేకూరుతుందని ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 162 రూట్‌లలో ఈ పాస్‌లను జారీ చేస్తున్నామని.. రూ.600తో ఆర్డీనరీ పాస్, రూ. 1000తో మెట్రో పాస్ కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పాస్ సాయంతో నిర్ణీత రూట్‌లో 8 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చని ఆర్జీసీ వెల్లడించింది.
గతంలో కేవలం విద్యార్ధులకు మాత్రమే రూట్‌పాస్ జారీ చేసేది ఆర్టీసీ.. కానీ మారిన పరిస్ధితుల నేపథ్యంలో సాధారణ ప్రయాణీకులకు కూడా రూట్ పాస్ ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే గ్రేటర్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రమే ఈ రూట్ పాస్‌లను అనుమతిస్తామని పేర్కొంది. ఈ పాస్‌ల ద్వారా సగం ధరకే రోజూ రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఆర్టీసీ వెబ్‌సైట్, బస్ పాస్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Also Read: తెలంగాణ బస్సుల్లో రుచికరమైన స్నాక్స్... టీఎస్ ఆర్టిసి సరికొత్త సర్వీస్
ఇదిలావుండగా.. తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులను ఆకట్టుకుని సంస్థ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బాట పట్టకుండా ఇప్పటికే టీఎస్ ఆర్టిసి లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ గరుడ పేరుతో హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలకు తిప్పుతున్న బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేసింది టీఎస్ ఆర్టిసి. శనివారం నుండి హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడు బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించనున్నారు. అయితే ఈ స్నాక్స్ కోసం ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయకుండా టికెట్ రేటులోనే రూ.30 కలిపి తీసుకోనున్నారు.
ఈ స్నాక్స్‌ను చిరుధాన్యాలతో తయారుచేయనున్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన చిరు ధాన్యాలతో తయారుచేసిన కారాతో పాటు చిక్కి, మౌత్ ప్రెష్ నర్, టిష్యూ పేపర్ ప్రయాణికులకు అందించాలని టీఎస్ ఆర్టిసి నిర్ణయించింది. ఈ స్నాక్ బాక్స్ ను హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడ బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ ఈ సర్వీస్ ప్రారంభించనున్నట్లు ఆర్టిసి ఉన్నతాధికారులు తెలిపారు.