Asianet News TeluguAsianet News Telugu

‘విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు’.. వైఎస్ షర్మిలపై వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు..

బుధవారం తెలంగాణ మీద, కేసీఆర్ మీద షర్మిల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అహంకారంతో విద్వేశపూరితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

TSREDCO chairman Satish Reddy police complaint against YS Sharmila
Author
First Published Dec 1, 2022, 12:38 PM IST

హైదరాబాద్ : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీద తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పాలకులను టెర్రరిస్టులని పేర్కొన్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి తన ఫిర్యాదును ఇచ్చారు. తానిచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైఎస్ షర్మిల మీద కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. 

షర్మిల టీవీ9 తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తెలంగాణ వస్తే.. హైదరాబాద్ కు రావాలంటే వీసా తీసుకుని రావాల్సి ఉంటుందని.. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీలో మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. వాటిని ఆమె ఊటంకిస్తూ.. “ఈ ఉగ్రవాదుల చేతుల్లో తెలంగాణను పెట్టకూడదనే.. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలా మాట్లాడారు” అని అన్నారన్నారు. ఈ మాటలతో తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను షర్మిల ఉగ్రవాదులతో పోల్చారని, తీవ్రంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. ముగ్గురు నిందితులకు బెయిల్.. ఈ షరతులు పాటించాల్సిందే..

శాంతియుతంగా చేసిన తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని, అలాంటి ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను, ప్రజలను షర్మిల ఉగ్రవాదంతో, ఉగ్రవాదులతో పోల్చడం ఆమెకున్న అహంకారానికి ఇది నిదర్శనమన్నారు. ఇంతటితో ఆమె ఆగలేదని.. మరో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల... తెలంగాణను ఆఫ్గనిస్తాన్ అంటూ పోల్చారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాలిబాన్ నాయకుడని ఆరోపించారని.. ఇలా మాట్లాడటంపై వై.సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో షర్మిల పాదయాత్ర చేసిన సందర్భంలో తెలంగాణను పాకిస్తాన్ అన్నారని గుర్తు చేసి, మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే షర్మిల తెలంగాణ మీద విషం చిమ్మింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. తమ అక్రమ ఆస్తులను రక్షించుకోవడానికి, రాజకీయంగా పలుకుబడి సాధించడానికి  బీజేపీతో షర్మిల కలిశారన్నారు. వారితో కలిసే తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ మీద షర్మిల  పైకి ఎంత ప్రేమ నటించినా... తెలంగాణ అంటే ఆమె మనసులో ఉన్నది మాత్రం విషమేనన్న విషయం  ప్రజలందరికి తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. అందరికీ ఈ విషయం తెలిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారని ఫైరయ్యారు.

టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైఎస్.షర్మిలకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు. తెలంగాణను ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ అంటూ, ఇక్కడి వారిని ఉగ్రవాదులతో పోల్చిన షర్మిలకు గవర్నర్ అపాయింట్ ఎలా ఇస్తారని, ఆమెపై ఎందుకు అంతగా సానుభూతి చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు తమిళిసై సౌందరరాజన్ గవర్నరా?  పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లకు తమిళిసై గవర్నరా? తేల్చి చెప్పాలని అన్నారు. 

తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను షర్మిల అవమానించారని.. అలాంటి వ్యక్తికి గవర్నర్ ఎలా అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా? లేకపోతే బీజేపీ పార్టీకి, ఆ పార్టీకి అనుబంధంగానో, అనుకూలంగానో  పనిచేస్తున్న ఇతర వేరే పార్టీల కోసం పనిచేస్తున్నారా? చెప్పాలని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios