Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మంత్రి కేటీ రామారావు లీగల్ నోటీసులు జారీ చేశారు.

TSPSC question paper leakage KTR serves notices to Bandi Sanjay and Revanth Reddy ksm
Author
First Published Mar 23, 2023, 7:30 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో తన పాత్ర ఉందంటూ వారు ఆరోపించిన నేపథ్యంలో కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిద్దరు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నందుకు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పారు. ఆ విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని కేటీఆర్ చెప్పారు. 

ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివితక్కువతనంతో వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు.

ఇప్పటికే వీరు తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ విమర్శించారు. గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సిన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్ తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తరువాత, వీరిద్దరు మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. 

టీఎస్‌పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ర్పచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉందని కేటిఆర్ ఆరోపించారు. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారని.. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయని అన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదన్నారు. ఇప్పటికైనా శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారాయని మండిపడ్డారు. 

తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని ఈ సందర్భంగా యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మువద్దని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios