ఆ ఇద్దరికి గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 120 మార్కులు: ముగ్గురు నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తాజాగా అరెస్టైన మరో ముగ్గురు నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్ లో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది.
పేపర్ లీక్ కేసులో అరెస్టైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సురేష్, రమేష్, షమీమ్ లను గురువారంనాడు సిట్ అరెస్ట్ చేసింది. నిన్న సాయంత్రం ఈ ముగ్గురిని సిట్ బృందం కోర్టులో హాజరుపర్చారు వీరికి ఏప్రిల్ 4వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో సిట్ బృందం కీలక అంశాలను ప్రస్తావించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన రమేష్ కు 120 మార్కులు వచ్చాయి. షమీమ్ కు 126 మార్కులు వచ్చినట్టుగా సిట్ గుర్తించింది.
షమీమ్ కు రాజశేఖర్ రెడ్డి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం పంపినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.
రమేష్ , సురేష్, షమీమ్ ల అరెస్ట్ కు ముందు 19 మంది సాక్షులను విచారించినట్టుగా రిమాండ్ రిపోర్టు తెలిపింది. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తున్న శంకరలక్ష్మి నుండి ప్రధాన సాక్షిగా సిట్ పేర్కొంది. టీఎస్‌టీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఈ విషయమై సాక్షులుగా ప్రశ్నించినట్టుగా ఈ రిపోర్టు తెలిపింది.కర్మన్ ఘాట్ లోని హోటల్ సీసీటీవీ పుటేజీని కూడా సిట్ బృందం సేకరించింది. ఈ హోటల్ యజమాని, మరో ఉద్యోగిని కూడా సాక్షులుగా సిట్ పేర్కొంది. నిందితుల నుండి ల్యాప్ టాప్ , 3 ఫోన్లు సీజ్ చేసింది సిట్ బృందం.
also read:నమ్మకం లేదు, విచారణకు రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
అరెస్టైన వారిలో నలుగురు టీఎస్‌పీఎస్ ఉద్యోగులు కాగా, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం సిట్ అధికారుల వెయిట్ చేస్తున్నారు.