టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. తండ్రి, కూతురు అరెస్ట్.. సిట్ అదుపులో మరో ఆరుగురు..!!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తుంది. తాజాగా ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన తండ్రి, కుమార్తెను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తుంది. తాజాగా ఈ కేసులో కరీంనగర్‌కు చెందిన తండ్రి, కుమార్తెను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్ తన కూతురు సాహితిని ఏఈ పరీక్ష రాసేందుకు రమేష్ సాయం కోరాడు. ఈ క్రమంలోనే హైటెక్ మాస్ కాపీయింగ్‌కు సంబంధించి రూ. 30 లక్షలకు రమేష్‌తో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్, సాహితిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
వారిని సిట్ అధికారులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదిలాఉంటే, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఆరుగురిని సిట్ బృందం బుధువారం అదుపులోకి తీసుకుంది. వీరు నీటిపారుదల శాఖలో పనిచేసిన అసిస్టెంట్ ఇంజనీర్ పి రమేష్ నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టుగా సిట్ గుర్తించింది. వీరి వద్ద నుంచి సేకరించిన తర్వాత మరికొందరిన కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రమేష్.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఏఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్ నిర్వహించిన రమేశ్.. ఆ తరువాత ఏఈ పరీక్ష పత్రాన్ని పలువురికి విక్రయించాడు. రమేష్ నుంచి దాదాపు 40 మంది ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు రమేష్ నుంచి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు.
ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అనుమానితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు సిట్ కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 80 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.