తెలంగాణ రవాణా శాఖ పరిధిలో 113 ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని.. సెప్టెంబర్ 5 దీనికి చివరి తేదీగా నిర్ణయించినట్లు కమీషన్ వెల్లడించింది 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా శాఖ పరిధిలోని మొత్తం 113 ఏఎంవీఐ ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ బుధవారం తెలిపింది. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని.. సెప్టెంబర్ 5 దీనికి చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించింది. కమీషన్ వెబ్ సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tspsc.gov.inను సంప్రదించాలని అధికారులు తెలిపారు. 

ఇకపోతే.. గతవారం కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌కు క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ, ఆర్వైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతినిచ్చింది. ఇందులో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఇంటర్ విద్యలో 40 లైబ్రరీయన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, ఆర్కైవ్స్‌ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్‌, 25 ఎలక్ట్రిషీయన్లు, 37 పీడీ పోస్టులు, కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చరర్‌ పోస్టులు, 24 లైబ్రరీయన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్ధిక శాఖ అనుమతులు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. 

ALso Read:Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 10,105 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం

కాగా.. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగాల భర్తీపై దృష్టి చేశారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.