వివాదాస్పద గ్రూప్-2 వైట్‌నర్ వివాదంపై హైకోర్టు స్టే విధించింది. గ్రూప్-2 రాత పరీక్షలో డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థుల జవాబులను పరిగణనలోకి తీసుకోరాదని.. వివాదాస్పదమై తొలగించిన 19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన అభ్యర్థులకు మార్కులు ఇవ్వాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.

దీనిని సవాల్ చేసిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై చీఫ్ జస్టిస్ టీబీఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్‌వీ భట్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పూర్తి స్ధాయిలో వాదనలు విన్నాకా తుది తీర్పును వెలువరిస్తామని అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తున్నామని చెబుతూ... విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

ఏమిటీ ‘‘వైట్‌నర్’’ వివాదం:
పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ పొరపాటున ఒక అభ్యర్థి ఓఎమ్మార్‌ను మరో అభ్యర్ధికి ఇచ్చారు.. తప్పు తెలుసుకున్న సదరు ఇన్విజిలేటర్ ఓఎమ్మార్ షీట్లను అభ్యర్థుల నుంచి లాక్కొన్నారు. తప్పు సరిదిద్ది ఎవరి ఓఎమ్మార్ షీట్లను వారికి ఇచ్చేశారు.

అయితే అప్పటికే అభ్యర్థులు వారి వక్తిగత వివరాలు నమోదు చేశారు. కొందరైతే జవాబులు కూడా గుర్తించారు. వాటిని ఇన్విజిలేటర్లే వైట్‌నర్‌తో చెరిపేసి మళ్లీ ఎవరి ఓఎమ్మార్‌లు వారికి ఇచ్చారు. వాలిడేషన్ సందర్భంగా వీరి ఓఎమ్మార్లను పరిగణనలోనికి తీసుకోకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ నవీన్ రావు ఆధ్వర్యంలోని ధర్మాసనం డబుల్ బబ్లింగ్ చేసిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోరాదని.. వివాదంగా మారిన 19 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన అభ్యర్ధులకు మార్కులు ఇవ్వాలని.. తిరిగి వాలిడేషన్ చేసి తాజాగా 1:2 నిష్పత్తిలో తుది జాబితా రూపొందించాలి అంటూ టీఎస్‌పీఎస్సీని గత అక్టోబర్ 12న తీర్పునిచ్చారు.

అలాగే తుది జాబితాలో ఎవరైనా అభ్యర్ధులు వైట్‌నర్ వినియోగించి ఉంటే వారి పేర్లు కూడా తొలగించాలని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించి న్యాయస్థానానికి సమర్పించాలని ఆయన ఆదేశించారు.

సింగిల్ జడ్జి తీర్పు మేరకు టీఎస్‌పీఎస్సీ కొత్తగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. మొదటిసారి కోర్టులో కేసు వేయడానికి కన్నా ముందు ఎంపికైన వారిలో 338 మందికి కొత్త జాబితాలో చోటు లభించలేదు..

దీనిపై హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించగా.. ‘‘ వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే వైట్‌నర్‌తో సరిచేసిన అభ్యర్థుల ఓఎమ్మార్‌లనే పరిగణనలోకి తీసుకుని జాబితా రూపొందించినట్లు టీఎస్‌పీఎస్సీ కోర్టుకు తెలిపింది. అయితే ఇన్విజిలేటర్లు చేసిన తప్పుకు తాము నష్టపోవాలా అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.