తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Group-2: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త .. ఎన్నోరోజుల నుంచి ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ మంగళవారం సాయంత్రం( ఇవాళ) పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటీఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని 782 (గ్రూప్-2 పోస్టులు) ఉద్యోగాల భర్తీ చేయనుంది ప్రభుత్వం.
గ్రూప్-2 పరీక్షలకు గతేడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఈ పోస్టుల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,51,943 దరఖాస్తు వచ్చాయి. దీని బట్టి చూస్తే.. ఒక్కో ఉద్యోగానికి సగటున 705 మంది పోటీ పడుతున్నారు.
గ్రూప్-2 ఖాళీల వివరాలు..
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 - 11 పోస్టులు,
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ - 59 పోస్టులు,
డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్) - 98 పోస్టులు,
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 - 14 పోస్టులు,
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్) - 63 పోస్టులు,
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 9 పోస్టులు,
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి)-126 పోస్టులు,
ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ - 97 పోస్టులు,
అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్) - 38 పోస్టులు,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(జనరవ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) - 165 పోస్టులు,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ - 15 పోస్టులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్-1, గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 5 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించగా.. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. అలాగే.. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువులు భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. అటు పోలీస్ శాఖలోనూ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా.. వైద్య ఆరోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 20న ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 తదితర విభాగాల్లో ఖాళీలు వున్నాయి.
