తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తర్వాత టీఎస్‌పీఎస్సీ నుంచి తప్పుకుంటానంటూ వ్యాఖ్యానించారు.

సంస్థలను నడిపే వ్యక్తులపై విమర్శలు సరికాదని.. తాము ప్రజలపక్షంలోనే ఉన్నామని... భయపడేది లేదని స్పష్టం చేశారు. మేధావులు రాజకీయ నాయకులైపోతున్నారని.. రాజకీయ నేతలు మేధావుల పాత్ర పోషించాల్సి వస్తోందని చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం మాది కాదనే ధోరణిలో మేధావి వర్గముందని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం విభాగంలో పనిచేస్తూ మంగళవారం గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరైన ఒక దివ్యాంగ అభ్యర్ధికి ఘంటా చక్రపాణి అనువాదకుడిని ఏర్పాటు చేశారు.

అనువాదకుడు ఉంటే అభ్యర్ధి చెప్పే విషయం బోర్డు సభ్యులకు అర్థమవుతుందని భావించిన ఆయన.. నగరంలోని దివ్యాంగ విద్యాలయాల్ని సంప్రదించారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరకు టాకింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధిని సంప్రదించగా.. అనువాదకుడిని పంపించారు.