Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ..

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది.

TSPSC approaches High Court Division Bench on Group-I prelims cancellation ksm
Author
First Published Sep 25, 2023, 11:37 AM IST

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లడంతో పాటు.. తమ అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరింది. అయితే దీనిపై మంగళవారం విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది.  ఈ ఏడాది జూన్ 11న గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇక, గతంలో పేపర్ లీక్‌ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ మరోసారి నిర్వహించింది. అయితే పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, నిర్వాహణ అనుమానస్పదంగా ఉందని  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆలూరు గిరిధర్ రావు వాదిస్తూ.. నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించే సమయంలో టీఎస్‌పీఎస్సీ అధికారులు బయోమెట్రిక్ వివరాలను సేకరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లలో హాల్ టికెట్ నెంబర్లు లేవని చెప్పారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జస్టిస్ పి మాధవీ దేవి నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్..  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అయితే రెండు సార్లు గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios