తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్‌).. విద్యుత్ వినియోగదారులు, రైతులకు కీలక సూచన చేసింది. ఈ మేరకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పని సరిగా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. 

జారీ చేసిన సూచనలు.. 
-తడి చేతులతో ఇంట్లో విద్యుత్ పరికరాలను, తీగలను ముట్టుకోవద్దు. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోవాలి. అతుకుల వైర్లు ఉంటే అనుభవం ఉన్న ఎలెక్ట్రిషియన్ తో సరి చేయించాలి. 

-చిన్న పిల్లలను విద్యుత్ పరికరాల వద్దకు వెళ్ళకుండ జాగ్రత్త పడాలి. వారిని డాబాలపై వెళ్ళకుండా చూడాలని, విద్యుత్ తీగలకు తగిలే ఆస్కారం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి.

-సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. 3 పిన్ ప్లగ్ తో నాణ్యమైన చార్జర్లను వాడండి. స్తంభం నుంచి ఇంట్లోకి వచ్చే సర్వీసు వైర్లు రేకుల పందిరిపై నుండి తాకకుండా ఉండేటట్లు చూసుకోవాలి.

- విద్యుత్ స్తంభాలు, నేల అంతా తేమతో ఉంటాయి కనుక తేమ ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలకు అస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరిలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించుకోవాలనే ఆతృతతో ఆ వ్యక్తిని ముట్టుకోరాదు. కర్ర ప్లాస్టిక్ లాంటి వస్తువులతో ఆ వ్యక్తిని వేరు చెయ్యాలి.

-సొంత రిపేర్లు ఎట్టి పరిస్థితులో చేయకూడదు. రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళకూడదు. స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా చూసుకోవాలి. పీవీసీ డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ స్తంభం నుంచి మోటరు వరకు వెళ్లే సర్వీసు వైర్లు అతుకులు లేని, నాణ్యమైనవిగా ఉండేలా చూసుకోవాలని

-స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలి, కరెంట్ మోటార్లు, పైపులను, ఫుట్ వాల్వులను తాకకూడదు.

-తెగి పడిన విద్యుత్ తీగలు, వేలాడే తీగలు వదలుగా ఉన్న కరెంటు తీగలు గమనిస్తే విద్యుత్ శాఖాధికారులకు సమాచారం అందజేయాలి. 

-విద్యుత్ తీగల క్రింద పశువుల పాకలు వేయకూడదు. పొలంలో రక్షణ కంచెకు విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలి. వర్షాలు కురుస్తున్న సమయంలో మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల క్రింద ఉండరాదు.

భారీ వర్షాలు కురుస్తున్నందున 16 సర్కిళ్ళ పరిధిలో విద్యుత్ పర్యవేక్షణ చేయడానికి కార్పోరేట్ కార్యాలయములో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందని.. 9440811244, 9440811245 నెంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు. అలాగే విద్యుత్ సంబంధిత సమస్యలకు, ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబరు. 1800 425 0028 కు లేదా 1912 కు ఫోన్ చేయాలని సూచించారు. ఇది కాకుండా ప్రతి సర్కిల్ కూడా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.