ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ కీలక సూచన: ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బుగ్గబావిగూడెంలో రెండు రోజుల క్రితం 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుండి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మధ్యాహ్నం పూట రోడ్లపైకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితులుంటేనే రోడ్డుపైకి వస్తున్నారు.ఈ నెల 28,29, 30 తేదీల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో వైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాత్రిపూట 25 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
38 నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 23 నుండి 26 డిగ్రీల మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.
నిర్మల్, నిజామాబాద్, కుమురంభీమ్ , ఆదిలాబాద్, సూర్యాపేట, భద్రాదద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి,మంచిర్యాల,జగిత్యాల, పెద్దపల్లి, ములుగు,వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
ఈ నెల 25న నిర్మల్, నిజామాబాద్, కుమరంభీమ్,ఆదిలాబాద్ , సూర్యాపేట, మహబూబ్ నగర్,భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ జిల్లాల్లో 40.1 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.