తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వివిధ విభాగాల్లో నిర్వహించే ఉమ్మడి పరీక్షల తేదీల్ని తాజాగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి అధికారులు కొద్దిసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో 2020లో నిర్వహించబోయే వివిధ ఉమ్మడి పోటీ పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు. 

అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశం కోసం ఎంసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మే 9,11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఎంసెట్ జరగనుంది. మే 13 నుంచి పీఈ సెట్, మే 2న ఈసెట్ జరగనుంది. 

మే 20, 21 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. మే 23న ఎడ్ సెట్, మే 25న లా సెట్ నిర్వహించనున్నారు. మే 27 నుంచి 30 వరకు పీజీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. మే నెలలో అన్ని ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలు జరగనున్నాయి. వాటి ఆధారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ తేదీలు ఖరారు చేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 

పరీక్షలకు దాదాపు నాలుగు నెలలు ముందుగానే షెడ్యూల్ ప్రకటించారు. పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల సంఖ్యని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలనీ ఉన్నత విద్యామండలి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.