ఏడవ తరగతి నుంచి ఎంసెట్ వరకు అన్ని పేపర్లు లీక్ అయిపోయాయి. అన్ని పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.

తెలంగాణ సర్కారు పరీక్షలో నిర్వహణలో ఘోరంగా విఫలమవుతోంది. ఏడో తరగతి నుంచి ఎంసెట్ వరకు ప్రతీ పేపర్ కు లీకుల బెడద తప్పడం లేదు. అయినా ఈ పొరపాట్లను సరిచేసుకొని ముందుకు వెళ్లేందుకు సర్కారు ప్రయత్నించడం లేదు.

టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గమనిస్తే... లీకేజీల లిస్టు టీఆర్ఎస్ హామీలంతా పెద్దగా తయారైంది.ముఖ్యంగా మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈ లీకేజీల బెడద తప్పడం లేదు. ఈ విషయంలో కడియం పూర్తిగా విఫలయయ్యారనే చెప్పొచ్చు.

లీకేజీ గొడవ కారణంగా ఒక్క ఎంసెట్ నే మూడుసార్లు నిర్వహించాల్సి వచ్చింది. ఎంసెట్ ప్రశ్నపత్రం బయట జిరాక్స్ సెంటర్లో అమ్మేస్థాయికి వెళ్లిపోయింది. అయినా ఇప్పటి వరకు ఈ లీకేజీ నిందితులను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.

ఇది చాలదన్నట్లు ఇటీవల నిర్వహించిన పదో తరగతి పేపర్‌ కూడా లీకేజీ అయింది. వరంగల్ లో లీకైన ప్రశ్నాపత్రం ఖమ్మం సెంటర్ వరకు వెళ్లిపోయింది. వాట్సాప్ లో కూడా ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది. దీనిపైనా సరైన చర్యలు లేవు.

గతంలో ఏడో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. అది చిన్న విషయమే అవ్వొచ్చు కానీ, ఇలా లీకేజీలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం గమనార్హం.