హైదరాబాద్‌: తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు గానూ 443 మంది పోటీ చేసినట్లు తెలిపారు. 35 ప్రాంతాల్లో 126 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుందని తెలిపారు. హైదరాబాద్ లో 7 చోట్ల, సికింద్రాబాద్ లో 6 కేంద్రాల్లో లెక్కింపు ఉంటుందన్నారు. 

ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్లు తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నిజామాబాద్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ స్థానంలో రెండు హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

వీవీ ప్యాట్‌ స్లిప్పుల రీకౌంటింగ్‌ కోసం ఆర్వోకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. రీకౌంటింగ్‌ కోసం అభ్యర్థి లేదా ఏజెంట్‌ ఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుదినిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లలో తేడా రాలేదని,  వీవీ ప్యాట్‌లో మాక్‌ పోలింగ్ స్లిప్పులు క్లియర్‌ చేయకపోతేనే తేడా వస్తుందన్నారు. ఈవీఎంలు, 17సీలో సమానంగా ఓట్లు వచ్చి వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే మరోసారి స్లిప్పులు లెక్కిస్తామని పేర్కొన్నారు. 

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో మానవతప్పిదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. సువిధ పోర్టల్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడిస్తామని,  ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు.