కేఫ్ కాఫీడే యజమాని సిద్ధార్థ మృతిపై తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధార్థతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

సిద్ధార్థ ఆకస్మిక మరణం చాలా బాధను కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఈ వార్త తెలియగానే చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థను కలిసే అవకాశం వచ్చినట్లు ఆయన చెప్పారు. సిద్థార్థ చాలా సౌమ్యుడని...జెంటిల్ మెన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, బంధు మిత్రులకు కేఫ్ కాఫీ డే సిబ్బందికి ఇది నిజంగా క్లిష్టమైన పరిస్థితి అని.. కానీ వారంతా నిబ్బరంగా ఉంటూ ఈ పరిస్థితిని తట్టుకోవాలని సూచించారు.

కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ అల్లుడు సిద్థార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం ఉదయం నేత్రావతి నది లో ఆయన మృతదేహం లభ్యమైంది. వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన నదిలో దూకడం తాను కల్లారా చూశానంటూ స్థానిక వ్యక్తి ఒకరు చెప్పడం విశేషం. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.