తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 18 సంవత్సరాలు. 2001 ఏప్రిల్ 27.. సరిగ్గా పద్దెనిమిదేండ్ల క్రితం! తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసేందుకు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన ఆయన చేసిన పోరు వల్ల నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగింది.

కాగా..పార్టీ స్థాపించి 18 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ట్వీట్ చేశారు.  27ఏప్రిల్ 2001న ఓ ధైర్య వంతుడి యాత్ర మొదలైందని..కేటీఆర్ తన తండ్రిని ఉద్దేశించి గర్వంగా ట్వీట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్రంలోనే కాదు.. వివిధ దేశాల్లో గులాబీ పతాకం రెపరెపలాడనున్నది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు సమాయత్తమయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బెహ్రెయిన్ తదితర దేశాలతోపాటు అనేక యూరప్ దేశాల్లో టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.

 

తెలంగాణ భవన్ లో కేటీఆర్.. జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున అట్టహాసాలు ఏమీలేకుండా సంబరాలు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.