తెలంగాణ రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా అందరిచేత గౌరవం  పొందుతున్నాను అంటే అందుకు కారణం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. 

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా అందరిచేత గౌరవం పొందుతున్నాను అంటే అందుకు కారణం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. 

సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ తనకు జన్మనిచ్చింది నాకన్న తల్లి శోభమ్మ అయితే రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల నియోజకవర్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోయామని కేటీఆర్ చెప్పారు. అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తామే ఎన్నికల్లో నిలబడినట్లుగా భావించి తనను గెలిపించారని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ముగ్గురిలో ఒకరిగా తనకు గుర్తింపు ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. 89వేల అఖండమెజారిటీతో గెలిపించి తనపై ఎంతో భాధ్యత పెంచారని కొనియాడారు.

తాను తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకుపోయినా, ఎక్కడికి వెళ్లినా ఒక గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలేనని అభిప్రాయపడ్డారు. తనకు రాజకీయ ఉనికిని ఇచ్చిన ప్రాంతం సిరిసిల్ల నియోజకవర్గం అంటూ చెప్పుకొచ్చారు. 

తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గమనించిన ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో 88 గెలిపించి అంటే 75శాతం మార్కులేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్నికల పర్యటనలో తాను ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మరింత అభివృద్ధి చేసి ఇది సిరిసిల్లేనా అన్నంత రీతిలో నియోజకవర్గ ప్రజలు ఊహించనంతగా అభివృద్ధి చేస్తానన్నారు. 

ఈ ఏడాదే సిరిసిల్లలో రైలు కూత వినిబడుతుందని రైలు తిరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు అండగా నిలబడతానని కార్మికుడిని యజమానిని చేస్తానన్నారు. సిరిసిల్లను సిరిశాల చేసేవరకు నిద్రపోనన్నారు. 

మరోవైపు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలవైపు దృష్టిసారించారని తెలిపారు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక ఉండకూడదన్న ఉద్దేశంతో ఇతర పార్టీలను కలుపుకుపోయి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. 

ఈ సందర్భంలో తనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారని తనకు సహకరించాలని కోరారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించేలా రూపుదిద్దుతామన్నారు. 

ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించామని, కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో పయనిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రైతు బంధు, రైతు భీమా వంటి కార్యక్రమాలతో దేశమే తెలంగాణ వైపు చూసేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.