ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ ప్రమాణస్వీకారానికి ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ లను జగన్ స్వయంగా ఫోన్ చేసి మరీ పిలిచారు. 

అయితే... జగన్ ప్రమాణ స్వీకారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్... తాను జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెళ్లడం కుదరడం లేదన్నారు. 

అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి స్పందించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పోవడం కరెక్టేనని.. కాంగ్రెస్ పార్టీ నుంచి సాంకేతికంగా ఏ ఒక్క ఎమ్మెల్యే తమ పార్టీలో చేరలేదన్నారు. తాము ఎవరికీ కండువాలు కప్పలేదన్నారు. చేరతామని ప్రకటించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో 8 చోట్ల టీఆర్ఎస్‌కు లీడ్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. 

హాజిపూర్ ఘటనతో చలించిపోయానని, ఆ ఘటనపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వారిని కలిసి. వారికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చేస్తామన్నారు. గ్లోబరీనా సంస్థకూ, తనకు సంబంధం ఉందంటూ కొంతమంది జ్ఞానం, ఇంగితం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.