పరిశ్రమలను తీసుకురావడంతో పాటు వాటిలో అధిక భాగం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామిక రంగాన్ని ప్రొత్సహిస్తూనే, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఎర్రజెండా పార్టీలు కార్మికులను ముందుంచి వారి రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు.

కేసీఆర్ ప్రగతి భవన్‌లోకి సామాన్యులను పిలవడం లేదన్న వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించారన్నారు. అంగన్ వాడీ, ఆశా, వీఆర్ఏ, వీఏవో, హోంగార్డులు, ఆర్టీసీ సిబ్బందికి వేతనాలు పెంచినట్లు కేటీఆర్ తెలిపారు.

కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికులకు ఇళ్లను మంజూరు చేశారని, ముఖ్యమంత్రి అయ్యాకా వారికి రూ. 2000 భృతి ఇచ్చామన్నారు. కొల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 14,000 ఇళ్లను మంజూరు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా వారికి మేలు జరిగేలా చూస్తామన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రతీ ఒక్క కార్మికుడిని ఆదుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మే 23న మనం కోరుకున్న ప్రభుత్వం వస్తే అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చునని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలను చూసి కొంతమందికి అసూయగా ఉందన్నారు. ఎర్రజెండా పార్టీలకు ఉనికి లేకుండా పోయిందని, ప్రతిపక్షాలకు ఏమి దొరక్క... ఏదో ఒక విషయాన్ని తీసుకుని టీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలను పట్టుకుని ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు