హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా జరిగిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జూన్ 27 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. 

పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా యునైటెడ్ ఇండియా బ్యాంకుకు రూ.11 కోట్ల 21 లక్షలు చెక్కును అందజేశారు. 

పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు రూ.2లక్షలు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకున్నాయని ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. 

ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు ఏం మింగడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నట్లు తెలిపారు. రోజు వారీ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం తమ పార్టీకి లేదన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. 

క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమన్న కేటీఆర్ ఏది ఏమైనా ప్రజా కోర్టులో తేల్చుకుందామంటూ చెప్పుకొచ్చారు. 

స్థానిక సంస్థల ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నెన్నో మాట్లాడారు. ఏవేవో చెప్పారన్నారు. కానీ ఏం జరిగిందో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కొంతమంది గడ్డాలు తీయమన్నారు. తర్వాత ఏమైందో అంతా చూస్తూనే ఉన్నామని కేటీఆర్ విమర్శించారు.