భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా ఒక్క పారిశ్రామిక వాడైనా ఏర్పాటైందా అని కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

తుమ్మలు మొలిచిన కాల్వల్లో గోదావరి జలాలు పారుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి, మూసి నదుల పరవళ్లతో భువనగిరిలో మరో త్రివేణి సంగమం ఏర్పాటు కాబోతోందన్నారు.

ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మోడీ, రాహుల్ గాంధీల గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతోందని కేటీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేయాలో కూడా తెలంగాణ సమాజమే నిర్ణయిస్తుందన్నారు.

కాంగ్రెస్ లీడర్లు బాత్‌రూమ్‌కు వెళ్లాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాల్సిందేనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైల్వే మంత్రిగా ఎవరుంటే వారి స్వరాష్ట్రానికి తరలివెళ్తాయన్నారు.

మన చేతిలో 16 మంది ఎంపీలుంటే బుల్లెట్ ట్రైన్‌లు సైతం హైదరాబాద్‌కు ఉరుక్కుంటూ వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 50 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేశారని.. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్‌ కమిటీలకు టార్గెట్లు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.