తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అనుకున్న సీట్లు రాకపోవడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే గతం కంటే టీఆర్ఎస్‌కు 6 శాతం ఓట్లు పెరిగాయని.. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ పార్టీది ఒక గెలుపు కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ హవాలోనూ 17 స్థానాలకు గాను 10 స్థానాలు గెలిచామన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందేమో విశ్లేషిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలు టీఆర్ఎస్‌కు సెట్ బ్యాక్ కాదని.. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్ధితుల్లో ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మోడీ హవాతో బీజేపీకి ఓట్లు పడ్డాయని.. ఆదిలాబాద్‌లో గెలుస్తామని బీజేపీ నేతలు సైతం భావించలేదన్నారు.

కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలేనని...వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఫెయిల్ కాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండింగ్ కనిపించిందన కేటీఆర్ వ్యాఖ్యానించారు.