హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరు పెంచారు. పార్టీలో పట్టు సాధించేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీరించకముందే పార్టీలోకి ఇండిపెండెంట్ అభ్యర్థిని ఆహ్వానించి తానేంటో నిరూపించుకున్నారు. 

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ కు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో జరగుతున్న పరిణామాలను ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు.  

దేశంలో కాంగ్రెస్, బీజేపీ వేరు వేరు అనుకుంటారని కానీ దొందూ దొందేనని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటూ దేశాన్ని భ్రష్టుపట్టించిన పార్టీలు కాంగ్రెస్ బీజేపీలేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఏమి చెయ్యలేదన్నారు.

అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తే రాష్ట్రాల హక్కులను సాధించుకోవచ్చునని కేటీఆర్ ప్రజలకు చెప్పారు. మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను యాచించి సాధించుకుందామా..శాసించి తెచ్చుకుందామా అని ప్రశ్నించారు.  

యాచించి సాధించుకోవాలో, సాధించి తెచ్చుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిపించి కేసీఆర్ కు ఇస్తే ఢిల్లీలో ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది మన కేసీఆర్ అని తెలిపారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే ప్రజలు అందించిన 17 మంది పార్లమెంట్ సభ్యుల సహకారంతో ప్రధాని పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. అందుకే ప్రతీ ఒక్కరూ గట్టిగా కృషి చేసి 17 పార్లమెంట్ స్థానాలను గెలిపించి కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కు సహకరించాలని కోరారు.