హుజూర్ నగర్: హుజూర్ నగర్ శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్మయంత్రి కె. చంద్రశేఖర రావు పకడ్బందీ వ్యూహరచన చేశారు. హుజూర్ నగర్ స్థానంలో కాంగ్రెసును ఏకాకిని చేసే వ్యూహాన్ని ఆయన అనుసరించారు. దాంతో ప్రతిపక్షాలన్నీ చెల్లాచెదురై అన్ని పార్టీలు కూడా కాంగ్రెసుకు దూరమయ్యాయి.

సాధారణ ఎన్నికల్లో మహా కూటమి కట్టి కాంగ్రెసుతో కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ స్థానంలో తన అభ్యర్థిని నిలబెట్టడానికి సిద్ధపడింది. తమకు మద్దతు ఇవ్వాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం, సిపిఐ నాయకులను కోరారు. ఆ పార్టీల మద్దతు సంపాదించడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. 

అయితే, సిపిఐ మద్దతు కోసం టీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎఐసిసి నాయకులు కూడా సిపిఐ మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిపిఐ కూడా 2018 ఎన్నికల్లో మహా కూటమిలో ఉంది. సిపిఐ తమకే మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

లోకసభ ఎన్నికల్లో పోటీ కూడా చేయని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం కాంగ్రెసును విస్మయపరిచే పరిణామమే.