హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసాయి. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే ఆస్కారం ఉంది. కొన్ని మునిసిపాలిటీల్లో ప్రతిపక్షాలు స్వల్ప మెజారిటీ సాధించి ఆనందాలు చేసుకున్న వారికి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి వార్త ఒకటి వారిని కలవరపెడుతుంది. 

కాంగ్రెస్ పార్టీకి దాదాపు 600 బిజెపికి 400 చోట్ల అభ్యర్థులు రంగంలో దించలేక పోయాయి. ఈ ఎన్నికల్లో వచ్చే  ఓట్ల శాతం రాబోయే భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న  అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలు టిఆర్ఎస్ పార్టీని సగభాగానికి పరిమితం చేసాయి.

పోటీ తీవ్రంగా ఉన్న మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే అభ్యర్థులపై దృష్టి పెట్టి విజయం సాధించిన అభ్యర్థులను శిబిరాలకి  తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. తరలించాయి కూడా. 

 టిఆర్ఎస్ పార్టీ వందకు పైగా స్థానాల్లో విజయం సాధించే స్థితిలో ఉన్నప్పటికీ.. కొన్ని స్థానాల్లో మాత్రం విపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆ  స్థానాలపై కూడా టిఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలఓటు సహాయంతో విజయం సాధించే స్థాయిలో పార్టీ అభ్యర్థులు గెలుపొందితే ఇబ్బంది లేకుండానే  ఆ స్థానాల్లో గట్టెక్కాలని భావిస్తోంది. ఇలా ఎస్ ఆఫీషియో ఓట్లతో అయినా సరే ఆ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయినా చైర్మన్ స్థానానికి తగిన మెజారిటీ రాకపోతే ఇతరులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 ఇతర పార్టీల నుంచి గెలుపొందిన నేతలు టీఆర్ఎస్ లో  చేరేందుకు ఆసక్తి కనబరిస్తే అలాంటి వారిని వెంటనే క్యాంపులకు తరలించి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునెలా అధికార పార్టీ రెడీ అవుతుంది

ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలకు ఇదే అంశంపై పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. విపక్ష పార్టీలు ఛైర్మెన్,మేయర్ స్థానాలు కలిపి సింగిల్ డిజిట్ కే పరిమితమవుతాయన్న అంచనాకు టిఆర్ఎస్ నేతలు వచ్చారు. 

టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఎదుర్కొనే స్థానాలపై నేతలు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నల్గొండ ఆదిలాబాద్, ఆదిలాబాద్ ల లోని కొన్ని మున్సిపాలిటీల్లో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించే అవకాశం ఉందని  పార్టీకి నివేదికలు అందాయి. దీంతో విపక్ష పార్టీ అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు  కసరత్తు మొదలు పెట్టారు