సొంత పార్టీ కార్యకర్తల నుండే ఓ రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ నాయకుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిని అనుభవిస్తూ...ఆ పార్టీ నాయకున్నే ఓడించాలని చూస్తావా అంటూ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ మందుల సామేల్‌‌పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

తుంగతుర్తి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం మందుల సామెల్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సిట్టింగ్ లకే మరోసారి అవకాశం ఇవ్వడంతో గాదరి కిషోర్ కే టికెట్ వరించింది. దీంతో సామెల్ తీవ్ర నిరాశకు గురై... టీఆర్ఎస్ పార్టీలో వుంటూనే తెరవెనుక కాంగ్రెస్ కు మద్దతిచ్చాడని ఆరోపణలున్నాయి.  

అయితే తుంగతుర్తిలో మళ్లీ ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ గెలిచినా... అతడి అనుచరులు, కార్యకర్తల్లో మాత్రం సామెల్ పై ఆగ్రహం మాత్రం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి సామేల్ తన స్వగ్రామం ధర్మారానికి వెళుతున్నట్లు సమాచారం అందుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డగూడూరు వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. గాదరి కిషోర్ కు అనుకూలంగా...ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం సామెల్ ను సురక్షితంగా అక్కడి నుండి బయటకు తీసుకువచ్చారు.