తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థుల అంచనాలను, లగడపాటి వంటి సర్వేలను తలకిందులు చేస్తే బంఫర్ మెజారిటీతో గెలుపొందింది. టీఆర్ఎస్ పార్టీకి,అదినాయకత్వానికి 2014 విజయం కంటే ఈ గెలుపే ఎక్కువ సంతృప్తినిచ్చి వుంటుంది. అప్పుడు కేవలం తెలంగాణ సెంటిమెంట్ వల్ల టీఆర్ఎస్ గెలుపొందిందన్న ప్రత్యర్థుల విమర్శలకు ఈ విజయంతో సమాధానం చెప్పడమే అందుకు కారణం. అంతే కాదు తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ లో గతంలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన టీఆర్ఎస్... ఈ ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు సాధించడం  కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలుండగా టీఆర్ఎస్ అభ్యర్థులు 14 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో గ్రామాల్లో ఇప్పటికే కనుమరుగైన టిడిపి పార్టీని ఇప్పుడు గ్రేటర్ నుండి తరిమివేసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ తెలుగు దేశం పార్టీ 10 స్థానాల్లో గెలుపొందగా ఈ సారి ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు నివాసముంటూ ఓ మినీ దక్షిణ భారతాన్ని తలపించే హైదరాబాద్ నగరంలో పట్టు సాధించడం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అమితానందాన్ని కలిగించే అంశమే. 

టీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలతో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని నేలకూల్చింది. ఏకంగా పది స్థానాలు సాధించిన టిడిపిని ఖాతా తెరవకుండా చేస్తే...గత ఎన్నికల్లో 5 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపికి ఒక్క స్థానానికే పరిమితం చేసింది. అయితే గ్రేటర్ పరిధిలో పట్టు సాధిండానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ఉపయోగపడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను మంత్రి కేటీఆర్ తన భుజాలపై ఎత్తుకుని ప్రచారాన్ని నిర్వహించారు. అదే సమయంలో టీఆర్ఎస్ ను హైదరాబాద్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో గ్రేటర్ లో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజారిటీని టీఆర్ఎస్ గెలుపొంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పై టీఆర్ఎస్ జెండా మొట్టమొదటి సారి ఎగిరింది. అదే ప్రభావం ప్రస్తుత ఎన్నికల్లో కూడా పనిచేసింది. మరోసారి హైదరాబాద్ బాధ్యతులు స్వీకరించిన కేటీఆర్ ఇక్కడ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇలా జీహెచ్ఎంసీలో పాటించిన వ్యూహాన్నే  మరోసారి అనుసరించి అదే ఫలితాన్ని రాబట్టడంలో కేటీఆర్ సఫలమయ్యారు.  

కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ జత కట్టి కూటమిని ఏర్పాటు చేయడం... గ్రేటర్ హైదరాబాదులో చంద్రబాబు ప్రచారం వల్ల టీఆర్ఎస్ కు గండి పడుతుందని అంచనాలు వేశారు. అయితే, చంద్రబాబును తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే విషయాన్ని కారణాలతో వివరించడంతో పాటు ఆంధ్ర సెటిలర్లకు తాము కల్పిస్తున్న భద్రత, ఇతర సౌకర్యాల గురించి కేటీఆర్ ఆత్మీయ సమావేశాల్లో వివరిస్తూ వెళ్లారు. వ్యూహాత్మకంగా చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ వెళ్లారు. తద్వారా హైదరాబాదులో జిహెచ్ఎంసి ఎన్నికల్లో లభించిన ఆదరణను చెక్కు చెదరకుండా కేటీఆర్ చూసుకున్నారు.

టిడిపి, బిజెపి ల పరిస్థితి  ఇలా వుంటే కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2014 లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా సాధించలేక పోయిన కాంగ్రెస్ ఈ సారి మాత్రం రెండు స్ధానాలను కైవసం చేసుకుంది. మహేశ్వరం లో సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బి నగర్ లో సుధీర్ రెడ్డి గెలుపు ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు చావుదెబ్బ తగిలినా...గ్రేటర్ మాత్రం చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఏర్పడింది.