ప్రస్తుతం ఏపీకి సంబంధించిన డేటా లీక్ వ్యవహారంతో టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం... టీడీపీ ఐటీ విభాగంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డబ్బులతో నకిలీ ట్విట్టర్ ట్రెండ్‌లను సృష్టించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని టీఆర్ఎస్ ప్రతినిధులు తెలిపారు. హ్యాష్ ట్యాగులను అసహజంగా ట్రెండ్ చేయడానికి కొన్ని ఏజెన్సీలకు భారీ ఎత్తున డబ్బులు ముట్టజెపుతున్నారని వారు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

#TSGovtStealsData, #KTRFakeTears హ్యాష్ ట్యాగులను కొంచెం పరిశీలించినప్పుడు ఈ ట్వీట్లు చేసిన వారు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు.

ఈ నకిలీ ట్వీట్స్ వెనుక టీడీపీ ఐటీ విభాగం హస్తముందని తమకు తెలిసినట్లు టీఆర్ఎస్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కృత్రిమ ట్రెండ్ వల్ల టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు.

అందువల్ల సంబంధిత ఆధారాల ద్వారా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తాము సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్.. జగన్ పాటిమీది వెల్లడించారు.