హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు తిరుపతిలో ఘన స్వాగతం పలికారు ఆయన అభిమానులు. వైకుంఠ పర్వదినం సందర్భంగా సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది హరీశ్‌రావు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ సహా పలు శాఖ మంత్రిగా పనిచేశారు. 

ఇకపోతే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన హరీష్ రావుకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. పూల దండలు, బొకేలతో హరీష్ రావును ముంచెత్తారు. హరీష్ రావు విజయం సాధించినందుకు, రికార్డు మెజారిటీ సాధించడంతో అభిమానులు అభినందనలు చెప్పేందుకు పోటీపడ్డారు. 

మరోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావును వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంలో హరీష్ రావును శాలువాతో సత్కరించారు. కాసేపు ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.