టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఓ నేత ఇప్పుడు... బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన రహస్యంగా పావులు కుదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల రహస్యంగా కలిసినట్లు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఓ పది మంది కార్యకర్తలను తీసుకొని కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి... అక్కడ ఆయనను కలిసినట్లు సమాచారం.

2014లో కార్పొరేటర్ సీటు కావాలని అప్పటి డిప్యుటీ స్పీకర్ పద్మారావును కోరగా కుదర్లేదు. ఈ సారి మళ్లీ అడ్డగుట్ట కార్పొరేటర్ గా ఉన్న విజయ కుమారికి రెండో సారి కూడా అవకాశం ఇస్తున్నట్లు డివిజన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇక లాభం లేదని భావించిన ఆ నేత... టీఆర్ఎస్ నేత పద్మారావు కార్యక్రమాలకు హాజరౌతూనే బీజేపీలో కి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

తన భార్యకు కార్పొరేటర్ సీటు వస్తుందని ఆయన ఆశించారు. రెండు సార్లు భంగపాటు ఎదురవ్వడంతో ఇంక పార్టీలో కొనసాగడం వేస్ట్ అని భావించాడు. అందుకే బీజేపీలోకి వెళ్దామని ప్లాన్ వేశాడు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

అడ్డగుట్ట డివిజన్‌ కార్పొరేటర్‌ సీటు కోసం పార్టీలు మారతూ ఓ టీఆర్‌ఎస్‌ నేత బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో ఆ నేత మాకొద్దని బీజేపీ డివిజన్‌ నాయకులు అంటున్నారు. ఈ విషయమై బీజేపీ నాయకులు త్వరలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలవనున్నట్టు తెలిపారు. ఆ నేతను పార్టీలోకి తీసుకోవద్దని వారు కిషన్ రెడ్డిని కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.