వరంగల్ : ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆయా పార్టీల అభ్యర్థులు చేసే స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. ఒకరు కటింగ్ వేస్తే మరోకరు రోడ్లు ఊడుస్తారు. మరోకరు టీ కాస్తారు. ఇంకొందరు అయితే బిందెలతో నీళ్లు మోస్తారు. ఇంకా చెప్పకూడనివి కూడా చేసేస్తారనుకోండి. 

ఇలా ఓట్ల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు నానా హంగామా చేస్తారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా వచ్చిరాని స్టంట్లు వేసేస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో టీఆర్ఎస్ నేతలు వినూత్నరీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

మూడో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ దగ్గర ఒక కుక్క మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీకే మీ ఓటు అంటూ చెప్పుకొచ్చారు. 

ఓటు సంగతి ఎలా ఉన్న కుక్క మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా చూసి ఓటర్లు కుక్కను ఆసక్తిగా గమనించారు. మరికొందరైతే ఎన్నికల ప్రచారంలో కుక్కలను కూడా వదలడం లేదంటూ గుసగుసలాడుకున్నారట.