తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు వదిలేది లేదన్న టీఆర్‌ఎస్‌.. ఉద్యమ కార్యచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. 

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు వదిలేది లేదన్న టీఆర్‌ఎస్‌.. ఉద్యమ కార్యచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలకేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే సేకరించాలని కోరారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు ముందే చెప్పామని.. రాష్ట్ర భాజపా నేతలు రైతులను రెచ్చగొట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని.. 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే నూకలు ఎక్కువగా వస్తాయని మంత్రి చెప్పారు. 

తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజని కొనుగోలు చేసేదాక కేసీఆర్ అధ్యక్షతన కేంద్రం పై పోరాటం కొనసాగుతుందని అన్నారు. 

రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచుకొండ ప్రధాన రహదారిపై జరిగిన రైతు నిరసన దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనకపోతే కొట్లాడుడే అని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దీక్షలో పాల్గొని ప్రసంగించారు. నిరసన దీక్షలో భాగంగా ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరిపే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు వీడి అన్నదాతల సంక్షేమంపౌ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.