పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. 

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు మీదే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతోందని ఎద్దేవా చేశారు. క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేదని.. ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిందన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రూ. 400 తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై భారం పడకుండా కేంద్రం రూ. 600 సబ్సిడీ భరించాలన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 5 రాష్ట్రాలు ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని అన్నారు. ఎన్నికలైన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతారని సీఎం కేసీఆర్‌ ఆనాడే చెప్పారని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడుతుందన్నారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. పేదలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని. దేశం నుంచి తరిమి కొట్టే వరకు బీజేపీకి బుద్ది రాదన్నారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చేసి మంచి పనులు 150కిపైగా ఉన్నాయని చెప్పారు.