చేవెళ్ల : చేవేళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య మంచి వ్యక్తి అని పనికోసం నాతో కొట్లాడతాడని టీఆర్ఎస్ అధినేత చెప్పారు. నాతో కొట్లాడతాడు కానీ ప్రజలను ఎవరినీ తిప్పలు పెట్టడని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ నాకు నీళ్లు కావాలి, మీరు ఏం చేస్తరో నాకు తెలీదు నా నియోకవర్గంలో నీరు రావాల్సిందేనని యాదయ్య పట్టుపట్టి తెచ్చుకున్నాడని తెలిపారు. కాలె యాదయ్యను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

చంద్రబాబునాయుడు తెలంగాణకు నీళ్లు అవసరం లేదని అడ్డుపడ్డాడని కేసీఆర్ ఆరోపించారు. పాలమూరు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. నీళ్లిచ్చిన కేసీఆర్ కావాలా..అడ్డుపడ్డ చంద్రబాబు  కావాలా అంటూ నిలదీశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవో రద్దు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు, ప్రజలు బాగుపడటమే తమకు కావాల్సిందన్నారు. చేవెళ్ల ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు తీసుకువస్తానని, కాలుష్య రహిత పరిశ్రమలు కూడా రప్పిస్తానని హామీ ఇచ్చారు. మీ భూములకు మంచి ధరలు రావాలని తెలిపారు. 

త్వరలోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, ఉద్దండా పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చి చేవెళ్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ఈ పని చేస్తానని తెలిపారు. కొత్త జీవో కాపీ తీసుకుని తానే స్వయంగా వచ్చి మీతో కలిసి భోజనం చేసి పోతానని సీఎం స్పష్టం చేశారు.

ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దుని బాగా ఆలోచించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. కొత్త అభ్యర్థులు ఎవరూ లేదరని నిలబడిన వాళ్లంతా పాతవాళ్లేనన్నారు. 58 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థి ఒకవైపు, 15 ఏండ్లు కష్టపడి తెలంగాణ సాధించి నాలుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య ఒకవైపున్నారని సీఎం తెలిపారు. 

అభివృద్ధి కోసం నాతో కొట్లాడే కాలె యాదయ్యకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీ పాలనలో కరెంట్ ఏవిధంగా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలే గమనించాలని తెలిపారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు హైదరాబాద్ తానే కట్టానని అంటున్నాడని మరి కులీకుతుబ్ షా ఏం చేశారో అని ప్రశ్నించారు. కులీకుతుబ్‌షా చార్మినార్ కడితే తాను సిటీ కడుతున్నానన్నారు. సరస్సులో చేపలు ఎలా పెరుగుతాయో అలానే హైదరాబాద్ ప్రఖ్యాతలు కూడా పెరగాలన్నారు. 

నాలుగు వందల ఏండ్ల నుంచి తయారైన నగరం హైదరాబాద్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాంటి మహానగరాన్ని చంద్రబాబు ప్రపంచ చిత్రపటంలో పెట్టానంటూ కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌ను పెడితే మరి కరెంట్ ఎక్కడ పెట్టావ్ అని ప్రశ్నించారు. 

కరెంట్ ఇవ్వకుండా ఎక్కడ దాచిపెట్టినవ్ అని నిలదీశారు. కాంగ్రెస్ మాట్లాడితే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉంటది. చంద్రబాబుకు మెంటల్ కింద మీద అయిందో చూపించండి అంటూ వ్యాఖ్యానించారు. కూటమిలో ఉండి కాంగ్రెస్ ఓడిపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చాడని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. 

తెలంగాణ వస్తే అంతా అంధకారమైపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడని కానీ తాము 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లు పోయామని కేంద్రంతో కొట్లాడి నానా ప్రయాసలు పడి కరెంట్ తెచ్చామన్నారు. కరెంట్ లేని స్థాయి నుంచి కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. తెలంగాణ చీకటి అవుతుందని శాపాలు పెట్టిన తెలంగాణ ఇప్పుడు వెలుగుల జిలుగులతో మెరుస్తోందన్నారు.